బుధవారం 15 మే 2013

మహా మనీషి ! ఆది శంకర యతీంద్రులు............





పూర్వం గురుకులాల్లో విద్యాభ్యాసం చేసేటప్పుడు,విద్యార్ధులు మధుకర వృత్తితో జీవించేవారు.అనగా ప్రతి ఇంటి ముందు నిలబడి"భవతీ !భిక్షాం దేహీ"అని భిక్షార్ధమై,ఎలుగెత్తి పిలిచేవారు.ఎంత సంపన్నుడైనా కూడా చదువుకునే విద్యార్ధి ,ఈ మధుకర వృత్తిని ఆశ్రయించవలసినదే!అలా ఎందుకు చేసే వారంటే !విజ్ఞాన సముర్పార్జనకు, సుఖానుభవమునకూ, చుక్కెదురు!ఎంతటి వారికైనా గురుకుల వాస క్లేశము అనుభవించక తప్పదు!అటువంటి సమయాల్లో,ఆ విద్యార్ధిని పోషించుకోవలసిన బాధ్యత సమాజానిదే!సమాజంలోని గృహస్థులు సాదరంగా ఇచ్చేభిక్షతో, విద్యార్ధి జీవించాలి.చదువుకుని,విజ్ఞాని అయ్యాకా,తన విద్యా వివేకాలను సమాజ హితమునకు తప్పక వినియోగించాలి.ఆ విధంగా తన చుట్టూ ఉన్న సమాజ ఋణాన్ని,విద్యార్ధి తీర్చుకోవాలి.ఆ రీతి లోనే ,ఆది శంకరా చార్యులు మధుకర వృత్తి చేస్తూ,విద్యాభ్యాసం చేసేవారు.
ఒక నాడు ఒక ఇంటి ముంగిట,నిలబడి"భవతీ! భిక్షాం!దేహీ"అని ఎలుగెత్తి పిలిచారు.చాలా సేపటికి కానీ,ఆ ఇంటి తలుపులు తెరుచుకోలేదు.కొంత సేపటికి ,దైన్యంతో,మూర్తీ భవించిన లేమిలా ఒక ఇల్లాలు వెలుపలికి వచ్చింది.ఏ రోజుకారోజే!దిన భత్యాలు సమకూర్చే, యజమాని ఆ రోజు ఇంట లేడు.కాబట్టి ఇంటిలో భిక్ష వేయడానికి ఏమీ లేదు.కానీ ఆమె ఊరుకోలేదు.ఇల్లంతా వెదికింది చివరికి ఒక మూలన,బాగా మాగిన ఒక ఉసిరి కాయను తెచ్చిశంకరుని భిక్షాపాత్రలో భిక్షగా వేసింది ."ఇంతకన్నా వేరే ఆహారం మా ఇంట లేకపోయిన దని"తన దైన్యాన్ని శంకరునికి విన్నవించింది .ఆ మాటకు శంకరుని హృదయం చలించి పోయింది.ఇరుగు పొరుగు వారంతా సంపన్నులు కాగా,ఈ ఇంటనే దరిద్ర దేవత ఎందుకు తిష్ట వేసిందా!అని ఆశ్చర్య పడ్డాడు.ప్రక్క వారి బాగోగులను పట్టించుకోని,సంపన్నుల సంపద సమాజ పుస్టికి నిదర్శనంకాదు.లేమిలో కూడా మధుకరమడిగితే ఏదో, ఇచ్చి తీరవలెననే,ఆమె సమర్పణ భావం సమాజ సంపద.పైగా మానవతకది,లక్షణం కూడాను.సమాజం పట్ల తన కర్తవ్యాన్ని,గుర్తించి , సమర్పణ భావం కల వారి వద్దనున్న సంపదే ,సమాజాన్ని నిలబెడుతుంది కూడ!అట్టి వారిని చేరిన సంపదే,సద్వినియోగం అవుతుంది.దీని గుర్తించిన మన ఆది శంకరులు,ఆత్మాను సంధానం గావించి,ఐశ్వర్య లక్ష్మిని ఆవాహన చేశాడు."కనకధారా స్తవం"అనే స్తోత్రం ద్వారా ఆమెను ప్రసన్నం చేసుకున్నాడు.ఫలితం ఆ గర్భ దరిద్రుని ఇంట కనక మహా లక్ష్మి బంగారు ఉసిరి కాయలను ధారగా కురిపించి,ఆ ఇంటికి పట్టిన దరిద్ర దేవతను తరిమికొట్టింది.చివరికి ఈ కధే!తన నిత్య జీవన వ్యాఖ్యానానికి తోలి బీజం శంకరునికి గురుకుల వాసం కాలం లోనే లభించింది.మానవుడు తోటి మానవుని,ద్వేషించడానికి,హింసించడానికి తోడ్పడే నాస్తిక కల్లోలం నుండి,ఆ నాటి మానవ సమాజాన్నిఉద్ధరించి, విశ్వ శాంతిని నెలకొల్పి,ధర్మ రక్షణకు ఉద్భవించిన ఆ మహా మనీషి.ఆ జగద్గురువే!పుట్టకుండాఉంటే,జగత్తు రక్త సిక్తమై,మానవ కంకాళ భూయిష్టమై ఉండేది.వారి భక్తి రాసామ్రుతాన్ని,ప్రజ్ఞా పాటవాల్నీ, ఆలోచనా రీతులను ఆక ళించుకున్నవారు,అనుసరించినవారు ప్రపంచం మొత్తం లోనే లేరని చెప్పాలి.నేడు ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఆ జగద్గురువులకు నా వందన సహస్రాలు

బుధవారం 1 మే 2013

గ్రీష్మ విలాసం



గ్రీష్మ ఋతువు నిరాడంబరత్వానికి ప్రతీక గా మన కవులు చమత్కరిస్తూ ఉంటారు.వారి ముచ్చటైన భావ చమత్కారాల్లో కొన్నింటిని ఈ రోజు మనం ముచ్చటించు కుందాము.

ఒక కవి అసలు త్రిమూర్తులైన బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులు కూడా ఈ వేసవి తాపానికి ఏ మాత్రం అతీతులు కారని సప్రమాణంగా నిరూపించాడు కూడా.శివుడు ఏక్కడ నివసిస్తాడండీ?మంచు కొండలోనే కదా!అదే !మహిమాలయమైన హిమాలయాల్లో కైలాస పర్వతంలో. ఎందుకోసమని? అంటారా?ఈ నిదాఘాన్నితట్టుకోలేకనే!మరి విష్ణు మూర్తి?నిరంతరం పాల సముద్రం మీదనే కదా!అది కూడా గ్రీష్మాటోపాన్నుంచి తప్పుకోవడానికేట! ఇంక మిగిలినది బ్రహ్మ గారు.ఆయన నిరంతరం తామర పూవులో నివసించడానికి కారణంఎవరంటారూ?ఈ గ్రీష్మమే!ఇది ఒక కవి చమత్కారం. మనకి ఈ వేసవిలో ఎక్కువగా కనిపించే మానవులు ఎవరో తెలుసునాండీ? సెగ గడ్డ ముఖాల వారు,పేలిన వీపుల వారు,చెమటలతో తడసిన బట్టల వారు.
                               ఈ వేసవుల్లో పట్టె మంచం మీద పడుకొనే వాడు, నాకు ఈ కటికి నేల చాలురా!బాబూ!అంటాడుట .వేణ్ణీళ్ళు కావాలనుకొనే వాడు.చన్నీటిలో మునగడానికే ఇష్ట పడతాడు.అలాగే డాబాల్లో నిద్రించే ధన వంతుడు కూడా, ఆరు బయలు హాయిగా పడుకుంటే బాగుంటుంది, అని భావిస్తాడు.అంతే కాదు!మేడల్లో,మిద్దెల్లో నివసించేవాడు.ఒక తాటాకు  గుడిసె ఎంతో మంచి సుఖమను కుంటాడు.మంచి బట్టలు కట్టుకునే వాడుకూడా నూలు బట్టల మీదకు పోతాడు.ఇలా ఈ గ్రీష్మం నిరాడంబరానికి ఎంతో ప్రతీకగా నిలుస్తుంది.

ఒక శ్రోత్రియ బ్రాహ్మణుడు ఈ గ్రీష్మంలో సంధ్య వార్చే నెపంతో మాటి మాటికీ ఆచమనం పేరుతో తెగ నీళ్ళు తాగేస్తాడట.చల్లదనం కోసం అస్తమానూ " అపవిత్ర: పవిత్రోవా "అంటూ ఎన్నో సార్లు తానూ పవిత్రతను కోరతాడట.నీళ్ళు నెత్తిన చల్లుకుంటూ ఉంటాడు.తడిపిన పంచినే మళ్ళా మళ్ళా తడిపి పిండకుండానే కట్టుకుంటాడు.ఇక జందాన్ని అస్తమానూ సవరిస్తూనే తన వీపును బరబరా గోకేస్తూ ఎంతో హాయిని అనుభవిస్తూ ఉంటాడు.అస్తమానూ మైల పడ్డానంటూ రోజూ పదే పదే స్నానాలు చేస్తూ ఉంటాడు.ఇలా ఈ గ్రీష్మ ఋతువు శ్రోత్రియ త్వానికి కూడా కిటుకులు నేర్పుతూ ఉంటుంది.
అలాంటి ఈ గ్రీష్మ ఋతువు ఈ సంవత్సరం మనల్ని ముందుగానే బాధించడం మొదలు పెట్టింది కదా!మరి ఇలాంటి గ్రీష్మాన్ని గురించి మరిన్ని చమత్కారాలు మన కవులు ఎందరో,ఎన్నో రకాలుగా వ్రాసారు.వ్రాస్తున్నారు కూడా!మరి అలాంటి విషయాలను మరోసారి తెలుసుకొని మనమూ ఆనందిద్దాం.